



శ్రీవిద్యోపాసన
శ్రీచక్రపూజా లేదా పరాపరపూజ అత్యంత ఉన్నతమైన పూజావిధానము. జీవాత్మ పరమాత్మతో నిరంతరంగా ఏకీభూతమైనట్టుగా భావించుకుంటూ ఉండడమే శ్రీవిద్యోపాసన. పూజ అనునది మూడు రకములు. 1) పరాపూజ 2) అపరాపూజ 3) పరాపరపూజ.
రెండవదిలేదు అనగా ప్రతీమాట, ప్రతీ ఆలోచన అంతా అద్వైతభావనతోనే చేసే పూజనే పరాపూజ అంటారు. ఇది ఎంతో ఉన్నతమైనది.
తనకు భిన్నంగా ఇంకొకటి ఉన్నాది అని తలచి అనగా ద్వైతభావనతో తన ఎదురుగా శ్రీచక్రమునో లేక మరియొక విగ్రహాన్నో పెట్టుకొని చేసే పూజనే అపరాపూజ అని అంటారు. ఇది సాధారణ పూజ.
ద్వైతంతో మొదలుపెట్టి అద్వైతంతో ముగించేపూజ పరాపరపూజ. ఇది మధ్యస్తమైన పూజ.
ఏ సాధకుడి ఆలోచనలు, హృదయం అతడి బాహ్యస్మృతినివీడి ఎల్లప్పుడూ పరబ్రహ్మమందు నిలచిఉంటుందో అదే పరాపూజ. దీనినే ఋతంభరప్రజ్ఞ అని అంటారు. ఈ పూజ అంతా మానసికంగానే జరుగుతుంది. ఇది అందరికీ సాధ్యంకాదు. అలా సాధ్యం చేసుకున్నవారినే ఉత్తమాధికారులు అని అంటారు. వీరు ఎల్లప్పుడూ సచ్చిదానందరూపులై ఉంటారు.
మనసులో గూడుకట్టుకున్న ద్వైతభావనలను నిరంతర సాధనద్వారా అద్వైతభావనలోకి తీసుకు వెళ్ళగలగడమే పరాపరపూజ. ఈ సాధకులను మధ్యమాధికారులని అంటారు. కొంచెం అర్ధమైన రీతిలో చెప్పాలంటే బాహ్యపూజనుండి అంతఃపూజలోకి ప్రయాణంచేయడమే పరాపరపూజ.
తను బ్రహ్మమునకు భిన్నుడని భావించి తన ఎదురుగా ఒకఛాయను అనగా శ్రీచక్రాన్నో, విగ్రహాన్నో ఏదైనా పెట్టుకొని పూజా సామాగ్రి సమకూర్చుకొని కల్పసూత్ర ప్రకారంగా మంత్రములను చదువుతూ చేసెడి బాహ్యపూజను అపరాపూజ అని అంటారు. ఈపూజను, సాధన ప్రారంభదశలో ఉన్నవారుగాని, మధ్యమాధికారులు గాని పాటిస్తారు.
నిజానికి సాధారణ సాధకులకు పరాపూజ వెంటనే అబ్బదు. దానికి ఎంతో పూర్వజన్మ సాధనాపుణ్యఫలం ఉండి తీరాలి. ఉదాహరణకు భగవాన్ శ్రీరమణ మహర్షి. ఆయన పూర్వజన్మల పుణ్యఫలంవల్లనే ఈ జన్మలో పరాపూజా తత్పరులు అయ్యారు. అందరూ ఆయనవంటి వారు కాలేరు. కాని ప్రయత్నిస్తే తప్పకుండా ఆ స్థాయికి చేరగలరు.
కాని పరాపూజాధికారం రావాలంటే అపరాపూజలో నిష్ణాతులు కావాలి. ఏ సాధకుడైతే నిరంతర తపన, పట్టుదల, దీక్ష, గురుభక్తి, సాధన కలిగిఉంటాడో అతడు తప్పక ఆధ్యాత్మికంగా ఎదుగగలడు. ఇది తధ్యం.
పూజయే యజ్ఞము. అయితే శ్రీచక్రోపాసన ఏదో మనకు ఇష్టం వచ్చినప్పుడు, ఏదో కాళీగా ఉన్నాముకదా అని అప్పుడప్పుడు చేసేది కాదు. అది నిరంతర ఉపాసన. శ్వాసతో పాటుగా జరగవలసిన ఉపాసన. జీవాత్మను పరమాత్మగా తెలుసుకోవడమే శ్రీవిద్యోపాసన లక్ష్యం. శ్రీవిద్యోపాసనకు మూడు అంగాలున్నాయి. వాటినే సంకేతాలంటారు. అవి మంత్రసంకేతం, చక్రసంకేతం, పూజా(తంత్ర)సంకేతం. ఇప్పుడు మనం ఈ సంకేతాలని క్లుప్తంగా అర్ధం చేసుకుందాం.
మంత్రసంకేతం:
శ్రీవిద్యోపాసనకు ప్రధానమైన అంగం మంత్రము. ఇదే పంచదశాక్షరి మంత్రం. ఈ మంత్రము వేదములో పరోక్షంగా చెప్పబడింది. వేదంలో చెప్పబడిన ఎన్నో మంత్రాలలో గాయత్రి మరియు పంచదశాక్షరి చాలా ముఖ్యమైనవి. గాయత్రిని ప్రకటగాయత్రి అని, పంచదశాక్షరిని అప్రకటితి గాయత్రి అని అంటారు. ప్రకట గాయత్రి మూడు వర్ణాలవారికి అందులోను మగవారికి మాత్రమే తండ్రిద్వారా ఇవ్వబడుతుంది. అదే అప్రకట గాయత్రి గురువుద్వారా అర్హులైన వారికి కుల, లింగ భేదములు లేకుండా ఇవ్వబడుతుంది. అయితే ప్రకటగాయత్రిని వేదమంత్ర రూపంగా ఉపదేశపడగా, అప్రకటగాయిత్రి మాత్రం సంకేత పదాల రూపంలో ఉపదేశపడుతుంది. ఈ సంకేత పదాలనే బీజాక్షరాలని అంటారు. ఈ మంత్రం రహస్యంగా గురుపరంపరగా ఉపదేశపడుతుంది. ఈ కారణాలవలననే ఈ మంత్రాన్ని అప్రకటిత గాయత్రి అని, రహస్యం అని అంటారు.
మంత్రంయొక్క అర్ధం, ఉపాసనాదేవత, మంత్రఉచ్ఛారణాకాలం, పద్ధతి మొదలైన సాంకేతక విషయాలను వివరించేదే మంత్ర సంకేతం. ఈ వివరణలన్నీ శ్రీభాస్కరరాయలువారు తమ వరివస్యారహస్యం అన్నగ్రంధంలో చాలా విస్తారంగా వివరించడం జరిగింది. అయితే ఇక్కడ మంత్రం గురించి చాలా క్లుప్తంగా మాత్రం చర్చించుదాము.
ఇక్కడ మంత్రము అంటే పంచదశాక్షరి మంత్రము. ఈ మంత్రమందు పదిహేను బీజాక్షరములుండడం వలెనే ఈ మంత్రాన్ని పంచదశాక్షరి అని అంటారు. ఈ మంత్రమందు దేవతా పేరు ఉండదు. ఈ పంచదశాక్షరి మూడు కూటములుగా ఉంటుంది. శ్రీలలితారహస్యనామములందు చెప్పబడిన “శ్రీమద్వాగ్భవకూటైకాస్వరూపముఖపంకజా“, “కంఠాధఃకటిపర్యంతామధ్యకూటస్వరూపిణీ“, “శక్తికూటైకతాపన్నాకట్యదోభాగధారిణీ “ అన్న మూడునామములందు ఈ పంచదశాక్షరి మంత్రమును చెప్పబడినది. మూలమంత్రములో ఉన్న మొదటి కూటమి అమ్మవారి ముఖపంకజముగా, రెండవకూటమి అమ్మవారి కంఠమునుండి కటివరకుగా, మూడవకూటమి కటినుండి పాదములవరకుగా భావించాలి.
సూక్ష్మంగా చూస్తే, మొదటికూటమి అర్ధం ఇలా ఉంటుంది. “చిఛ్చక్తిరూపమైన అమ్మా (ఏ) అవిద్యవలన పుడుతున్న(క) బ్రహ్మకు భిన్నుడను భేదభావమును (హ్రీం) తొలగించు (ఈల)“. జాగ్రత్తగా గమనిస్తే జీవభావాన్ని తొలగించమని అమ్మని ప్రార్ధించడం ఇక్కడ కనిపిస్తోంది. ఈ జీవభావమే మహావాక్యంలో చెప్పబడిన “త్వం”.
ఇప్పుడు రెండవ కూటమిని అర్ధంచేసుకుందాము. అంతా పరివ్యాప్తమైఉన్న (హల) బ్రహ్మము(క) అన్న స్థితికి నన్ను (హస) చేర్చుము (హ్రీం). “నేను బ్రహ్మముఅని తెలియజేయుము” అని అర్ధం. మొదటి కూటమి ద్వారా అవిద్య తొలగబడగా ఇప్పుడు సాధకుడు తనే బ్రహ్మమని తెలుసుకుంటాడు. ఇక్కడ అలా తెలుసుకోబడిన ఆ బ్రహ్మమే మహావాక్యంలో చెప్పబడిన “తత్“.
ఇక మూడవకూటార్ధము చూడగా, ఆ విధంగా తెలుసుకోబడిన నా స్వరూపమందు ఎల్లప్పుడూ ఉండునట్టుగా చేయుము (సకలహ్రీం) అని అర్ధం. అనగా అది నేనే అయ్యి ఉన్నాను. ఈ భావమే మహావాక్యంలో చెప్పబడిన “అసి”. మొత్తంగా చూస్తే తత్త్వమసియే పంచదశాక్షరి అని అర్ధం అవుతోందికదా.
ఈ మంత్రమునకు వైదిక మంత్రములలాగే స్వరయుక్తముగా జపవిధానం కూడా కలదు. ఇలా ఎన్నో రహస్యాలు కలవు. అవి గురుముఖతః తెలుసుకోదగినవే. ఇలా ఏ సాధకుడు రహస్యాలను తెలుసుకొని సాధన చేస్తాడో అతడు సాక్షాత్తు పరబ్రహ్మమే అవుతాడు.
అయితే చాలామంది మంత్రమును తెలుసుకొని (అంటే ఒక పుస్తకంచూసో, అంతర్జాలంలో చూసో, ఎవరి దగ్గరైనా ఫోన్లో తెలుసుకొనో) మంత్రం జపం చేస్తుంటారు. సశాస్త్రీయంగా గురువుదగ్గర ఉపదేశం తీసుకొని మంత్రానుష్టానం చేసేవారు చాలా తక్కువ. వారిలో కూడా చాలామంది ఉపదేశం తీసుకొని రహస్యాలు తెలుసుకోకుండా ఏదో గొప్ప సాధన చేస్తున్నట్టుగా ఫీల్ అయిపోతుంటారు. అవన్నీ తమని గురువే పిలిచి తమకు చెప్పాలని అనుకుంటుంటారు. ఇదంతా సాధన అన్న ముసుగులో అహంకారపూరితమైన ప్రవర్తనే తప్ప మరేమీ కాదు. నిజానికి మన సాధన, నడవడిక అహంకారరహితమై ఉండాలి. అప్పుడే రహస్యాలు తెలుసుకోవాలన్న జిజ్ఞాస కలుగుతుంది. అప్పుడు గురువును సమీపించి అత్యంత వినమ్రతతో సాధనా రహస్యాలు తెలుసుకోవాలి.
ఇప్పుడు చక్రసంకేతం తెలుసుకుందాము.
చక్రసంకేతం:
శక్తిదేవతలయొక్క సమూహమే చక్రము. వారికి సంబంధించిన సమాచారమే సంకేతము. శ్రీచక్రములో ఉండే దేవతలు ఎవరు? వారు ఎలా ఉద్భవించారు? ఇలాంటి విషయాలకు సంబంధించిన రహస్యములే చక్రసంకేతము. బహుస్యాం ప్రజాయేయ అని బ్రహ్మము తలచి ఏకంగా ఉన్న తను బహుత్వంగా మారి అనగా సృష్టిని చేసి దానిని పాలించి, తిరిగి తనలోనే లీనం చేసుకుంటుంది. ఇక్కడ జాగ్రత్తగా గమనించవలసిన విషయం ఏమిటంటే, సృష్టి, స్ఠితి, లయ అంతా ఆ పరబ్రహ్మములోనే జరుగుతుంది. మళ్ళీ కొంతకాలం తర్వాత సృష్టి జరుగుతుంది. లయనుండి తిరిగి సృష్టి జరగడానికి మధ్యన తిరోధాన, అనుగ్రహ అను రెండు కృత్యములు కూడా ఉంటాయి. ఏ జీవులకైతో కర్మ పరిపక్వమవదో వారి కర్మ పరిపూర్ణతకై అమ్మ దయతలచి వారికి మరియొక అవకాశము ఇవ్వదలస్తుంది. అదే అనుగ్రహము. తిరిగి సృష్టి జరగడానికి జరగవలసిన కాలమంతా జీవులన్ని అమ్మకుక్షిలోనే ఉంటాయి. అదే తిరోధానము. ఇదంతా బాహ్యంగా కనిపించేది. సూక్ష్మంగా చూస్తే ఇదే స్వరూపమును (ఆత్మస్ఫురణ) తెలుసుకోవడము. బయటవేరొకటి ఉన్నాది అన్న జ్ఞానము అంతఃకరణ జ్ఞానము ఉన్నప్పుడు మాత్రమే తెలుస్తుంది కదా. ఈ అంతఃకరణ జ్ఞానము లేనంతవరకు అంతా వేరుగానే కనిపిస్తుంది.
ఆత్మస్ఫురణ కలిగిన పరమేశ్వరుడు, జగత్తును, జీవులను సృష్టిస్తాడు. అలా సృష్టించబడిన వాటియందు అతడు సూక్ష్మరూపంలో ఉంటాడు. జగత్తు భోగప్రదాత. జీవులు స్థూల, సూక్ష్మ, కారణదేహాలను కలిగి ఉంటాయి. జీవులు జగత్తునందు ఎప్పుడైతే తమ దృష్టిని మరల్చుతారో వారు మాయా ఆధీనులవుతారు. జీవులకు ఈ భోగప్రదాత అయిన జగత్తే భోగస్థానము. జీవులు మాయలో కొట్టుమిట్టాడుతూ భోగములకొరకై అర్రులుచాచుతూ తమలోనే ఉన్న పరమేశ్వరుడును తెలుసుకొనలేక మళ్ళీ మళ్ళీ జన్మలు ఎత్తుతూ ఉంటారు. ఇదంతా ఆయా జీవులయొక్క పూర్వకర్మముననుసరించి జరుగుతూ ఉంటుంది.
నిజానికి కనిపించే జగత్తంతా పరమేశ్వరుని ఇచ్ఛామాత్రమున ఏర్పడిన ఒకానొక చిహ్నము. ఈ చిహ్నమే చక్రము. ఇది ఆ పరమేశ్వరుని మనోమయ జగత్తు. అలా తెలుసుకున్న వారికి ఇది మోక్షస్థానము. తెలియకున్న వారికి ఇది భోగస్థానము. మొదటివారు మోక్షగాములు రెండవవారు భోగకాములు.
ఈ విధంగా చూస్తే చక్రము బ్రహ్మాండముగాను, పిండాడముగాను తెలుస్తున్నది. ఇదంతా బాహ్యదృష్టికి మాత్రమే. అంతర్ దృష్టికి మాత్రము మనస్సే శ్రీచక్రము. ఇదే పరమరహస్యము.
ప్రకాశ, విమర్శాత్మకములైన కామేశ్వరీ, కామేశ్వరుల సామరస్యఫలితమే అపరబిందువు. ఈ అపరబిందువునుండి శ్రీచక్రము ఉద్భవిస్తున్నది. బిందువు, త్రికోణము, అష్టకోణములు, అంతర్దశారము, బహిర్ధశారము, చతుర్దశారము, అశ్టదళములు, షోడశదళములు, చతురస్రముల సమూహమే శ్రీచక్రము.
శాస్త్రములందు సృష్టి గురించి రెండురకముల సిద్ధాంతములు చెప్పబడినవి. అవి సృష్టి-దృష్టివాదము మరియు దృష్టి-సృష్టివాదము. సృష్టి-దృష్టి వాదముననుసరించి ఈ చరాచర జగత్తు అంతా ఈశ్వరుని యొక్క జడశక్తి వలన జరిగినది అని చెప్పబడుచున్నది. ఇక దృష్టి-సృష్టివాదముననుసరించి, జీవుడు ఎప్పుడైతే తనలో ఉన్న కుండలినీ శక్తిని చలింపచేస్తాడో అప్పుడు సృష్టిజరుగుతుంది అని తెలియబడుచున్నది. అద్వైతసిద్ధాంతము అంతా ఈ దృష్టి-సృష్టివాదముననుసరించియే చెప్పబడుచున్నది.
ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి…శ్రీచక్రము బ్రహ్మాండరూపమైనా పిండాండరూపమైనా అది అంతా మనస్సుయొక్క చిత్రీకరణ మాత్రమే. అందుకే మనఃమూలమిదంజగత్ అని పెద్దలు చెబుతారు. మనస్సు పనిచేయునప్పుడు జగత్తు, భోగము, రాగము, శోకము మొదలగు అన్ని వికారములు తెలుస్తుంటాయి. జాగ్రత్ మరియు స్వప్నావస్థలందు జీవుని మనస్సు పనిచేస్తూ ఉండడం వలన అన్ని రకాల వికారములు గమనించవచ్చు. కాని, సుషుప్తి (గాఢనిద్ర)దశయందు మనస్సు పని చేయదు. అప్పుడు జగత్తు, మరి ఏ వికారములు ఉండవు.
శుద్దబ్రహ్మమునకు ఎటువంటి చిత్తవృత్తులు ఉండవు. అది ఎప్పుడూ చలించక స్వరూపస్థితియందు రమించుతూ ఉంటుంది. అది సర్వానందమయము. బిందురూపము. ఈ బిందువు శ్రీచక్రములోని అంతర్ త్రికోణములో ఉన్న బిందువుకాదు. ఇది శ్రీచక్రములోని చంద్రమండలములో ఉన్న బిందువు.
ఇక శ్రీచక్రములోని అంతర్ త్రికోణములో ఉన్న బిందువు కామేశ్వరీ, కామేశ్వరుల సామరస్య రూపము. ఇది పరబ్రహ్మచక్రము. ఈ బిందువే సృష్టికి మూలము. అనగా ఈ బిందువునుండే శ్రీచక్రము ఆవిర్భవిస్తున్నది. నిజానికి ఈ బిందువు అవ్యక్తము. అంతర్ త్రికోణములో బిందువును ఉంచి పూజించడం అవైదికము. నిజమైన దక్షిణ, సమయాచారపరులు చంద్రమండలములోని బిందువునే పూజిస్తారు. అదే వైదికము.
మిగతా రహస్యములు గురుముఖతః తెలుసుకోవాలి.
ఇప్పుడు పూజాసంకేతం తెలుసుకుందాము.
పూజాసంకేతం:
పూజ అనగా నిరంతర ధ్యానము. అదియే సవికల్పసమాధి. ఆవాహన, ఆసన మొదలగు ఉపచారములకు సంబంధించిన క్రియా విధానమే పూజ అనబడును. నిజానికి జీవాత్మ, పరమాత్మ ఒక్కటే అన్న నిజము తెలుసుకోవడమే పూజయొక్క పరమ ప్రాముఖ్యత. సాధారణంగా మనం చేసే పూజల్లో దేవతా నామాలలో నమః అని చేర్చి అర్చించుతాము. ఉదాహరణకు, శ్రీమాత్రేనమః, ఓం గణపతయేనమః, శ్రీవిష్ణవేనమః ఇలా…. ఇందులో దేవతా నామము తత్ పదమును, నమః పదము త్వం పదమును సూచించును. ఈ రెండు పదముల కలయికే తత్వం. సాధన ఫలించినప్పుడు జీవాత్మ పరమాత్మలో కలుస్తుంది. అదే “అసి”. కనుక నామపూజయే మహావాక్యమైన తత్త్వమసి అవుతోంది. నామపూజకు ఇంతటి ప్రాముఖ్యత కలదు.
పూజ రెండు రకాలు. ఒకటి బాహ్యపూజ రెండు అంతర్ పూజ. పరిశుద్ధ భావనతో బాహ్యపూజ చేయగా చేయగా అంతర్ పూజయందు ఆసక్తి కలిగి అందు ఆ సాధకుడు ప్రవేశపెట్టబడతాడు. బాహ్యపూజయందు సాధకుడు తన ఎదురుగా ఓ దేవతా విగ్రహాన్నో లేక ఆ దేవతా యంత్రాన్నో ఏదేని ఒక ఛాయని పెట్టుకొని ధ్యానావహనాది ఉపచారాలతో పూజ చేస్తాడు. అదే అంతర్యాగంలో సాధకుడు తనలోనే ఆ దేవతను చిచ్ఛక్తిగా గుర్తించి తనయందే ఉపచారపూజలను ఆ దేవతకు చేస్తున్నట్టుగా భావిస్తూ కొన్నాళ్ళకి తనలో ఉన్న ఆ చిచ్ఛక్తి, తను వేరుకాదు అన్న భావనకు చేరుకుంటాడు. అది చాలా ఉన్నతమైన సాధన. అయితే కొంతమంది ఈ ఉన్నతమైన స్థితికి అంతర్యాగం మాత్రంచాలు బాహ్యపూజ అవసరంలేదు అది ఉత్త టైం వేస్ట్ పని అని ప్రచారం చేస్తున్నారు. బాహ్యపూజలో నిష్ణాతులు కానిదే అంతర్యాగం ఫలించదు. అది సత్యం. బాహ్యపూజను ఎంతో నియమంగా మనస్సుని ఏకాగ్రతో ఉంచి, ఎదురుగా తన ఉపాస్యదేవత ఉన్నట్టుగా భావించి చేయాలి. ఇటువంటి నియమ, నిగ్రహ, ఏకాగ్రతలు లేకుండా చేసే ఏ పూజైనా - బాహ్యమైనా, అంతర్యం అయినా ఉత్త టైం వేస్ట్ పనులే. అంతెందుకు, ఇప్పటికీ చాలా అంతర్యాగ నిష్ణాతులైన శంకరాచార్యపరంపర పీఠాధిపతులు కూడా బాహ్యపూజ చేస్తున్నారుకదా. విజ్ఞులు గుర్తించగలరు. కనుక బాహ్యపూజ చాలా ముఖ్యమైనది.
ఒక సాధకుడు అలా సాధనచేయగా అతడు ప్రాపంచిక బంధనాలనుండి విముఖుడయి అశాశ్వతమైన ఆనందాలను విడనాడి శాశ్వతమైన ఆనందసాగరంలో మునిగిపోతాడు. ఆత్మ సరిహద్ధులు లేనిదిగా గుర్తిస్తాడు. అదే బ్రహ్మమని తనకు బ్రహ్మకు భేదంలేదని గుర్తించి అహంబ్రహ్మాస్మి అన్న సత్యాన్ని తెలుసుకుంటాడు.
Regards: https://srividyayogi.blogspot.com/





